చల్ల అంటే తెలుగులో మజగ. వాటితో వేసే పునుగులు కాబట్టి చల్ల పునుగులు అయ్యాయి. ఆంధ్రుల చల్ల పునుగులు బయట కరకరలాడుతూ లోపల స్పాంజీ కంటే మెత్తగా మృదువుగా ఉంటాయి. ఒకటి తినడం మొదలెడితే కనీసం పాతికకి తక్కువ తిన్నా ఆశ్చర్యపోనవసరం లేదు!!!

సాధారణంగా పునుగులు అంటే మినప్పిండితోనే వేస్తారు. అంటే, మిగిలిపోయిన ఇడ్లీ పిండితో లేదా మిగిలిపోయిన అట్లతోనో. కానీ ఈ చల్ల పునుగులు మైదా పిండిలో వంట సోడా పెరుగు వేసి పులియబెట్టి నూనెలో బోండాలుగా వేసి ఎర్రగా వేపుతారు.

ఈ చల్ల పునుగులు నిజానికి మైసూర్ బజ్జీనే, కానీ ఇవి ఉసిరికాయంత సైజులో ఉంటాయి అంతే! పుల్లని పెరుగు వాడతారు అంతే!!! కానీ ఈ చల్ల పునుగులు మైసూర్ బజ్జీకి మళ్ళీ లోపల ఉండ కట్టవు. అందుకే ఈ రెసిపీ వంట రాని వారు చేసినా పక్కాగా వస్తుంది.

నిజానికి ఈ రెసిపీ చాలా సులభం, పునుగులకి కావాల్సిన పదార్ధాలన్నీ కలిపి నూనెలో వేసి వేపి తీసుకోవడమే! ఇంత సులభమైన రెసిపీ అయినా కొన్ని టిప్స్ తెలుసుకుంటే మాత్రం ఎలాంటి పొరపాటు జరగకుండా కచ్చితంగా ఎప్పుడు చేసినా ఒకేతీరులో వస్తాయ్!!!

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు దహి బల్లా

టిప్స్

పెరుగు

  1. పెరుగు పుల్లగా ఉంటె పునుగులు చాలా రుచిగా ఉంటాయి, ఇంకా పిండి కూడా త్వరగా పొంగుతుంది, పిండి లోపల ఉండకట్టదు.
  2. పులిసిన పెరుగు లేకపోతే కొంచెం అంటే ¼ tsp సోడా ఎక్కువ వేసుకోండి.

పిండి:

  1. ఈ పునుగులకి కేవలం మైదా పిండి మాత్రమే వాడాలి. బియ్యం పిండి కొద్దిగా వేసినా అది మైసూర్ బోండా అయిపోతుంది.

పిండి కలిపే తీరు/బొండాలు నూనెలో పేలడానికి కారణాలు :

  1. పిండి పెరుగులో వేశాక బాగా బీట్ చేయాలి, అప్పుడే లోపలి గాలి చేరి పిండి పొంగుతుంది. గంట సేపు రెస్ట్ ఇచ్చిన తరువాత కూడా మరో సారి పిండి కలిపి బొండాలు వేసుకుంటే నూనెలో పేలవు బొండాలు!!!

బొండాలు సరిగా రాకపోవడానికి కారణాలు:

  1. వేసిన వంట సోడా సరైనది కాకపోతేనే పిండి పొంగదు, బొండాలు మృదువుగా ఉండవు.
  2. వంట సోడా ఎప్పుడు తాజాది వాడుకోండి. చెంచా పెరుగులో చిటికెడు సోడా వేసి చుడండి, పెరుగు పొంగితే సోడా మంచిదే అని గుర్తు!!!

చల్ల పునుగులు - రెసిపీ వీడియో

Challa Punugulu | Buttermilk Fritters | How to Make Buttermilk Fritters

Street Food | vegetarian
  • Prep Time 1 min
  • Soaking Time 1 hr
  • Cook Time 15 mins
  • Total Time 1 hr 16 mins
  • Serves 4

కావాల్సిన పదార్ధాలు

  • 1 Cup పుల్లని పెరుగు
  • 1 Cup మైదా
  • ఉప్పు (రుచి ప్రకారం)
  • 1 tbsp జీలకర్ర
  • 2 tbsp పచ్చిమిర్చి తరుగు
  • 1 tbsp అల్లం తరుగు
  • 1 tbsp కరివేపాకు తరుగు
  • నూనె (వేపుకోడానికి)
  • 1/2 tbsp వంట సోడా
  • నీళ్లు (తగినన్ని)

విధానం

  1. ఒక గిన్నెలో నూనె తప్ప అన్ని పదార్థాలను జోడించండి.
  2. అన్ని పదార్థాలను కలపండి మరియు ఒక గంట సేపు వదిలేయండి
  3. గంట తరువాత బాగా కలుపుకోండి
  4. నూనెని బాగా వేడి చేసి తడి చేత్తో ఉసిరికాయంత పునుగులు వేసుకోండి
  5. పునుగులు ఎర్రగా బంగారు రంగు వచ్చేదాకా వేపి తీసి వేడి వేడిగా అల్లం పచ్చడితో సర్వ్ చేసుకోండి

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments