హర్యాలీ వెజ్ ధం బిర్యానీ
బిర్యానీ లవర్స్కి మరో టేస్టీ బిర్యానీ హర్యాలీ వెజ్ ధం బిర్యానీ. సంధర్భం ఏదైనా కానివ్వండి పర్ఫెక్ట్ ఈ హర్యాలీ వెజ్ ధం బిర్యానీ. వండితే వీధి చివరికి రావాలి అంటాం కదా అలా ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది ఈ హర్యాలీ బిర్యానీ రెసిపీ.
చాలా సార్లు హైదరాబాదీ వెజ్ ధం బిర్యానీ కంటే హర్యాలీ వెజ్ ధం బిర్యానీ బెస్ట్ బిర్యానీ అనే అంటాను. ఎందుకంటే ఈ బిర్యానీలో మసాలాలు కారాలు హైదరాబాదీ ధం బిర్యానీ వాడినంత వాడనవసరం లేదు. కాబట్టి ఎంత తిన్నా హాయిగా అనిపిస్తుంది పొట్టకి. ఇంకా రైస్తో పాటు వేసే పుదీనా పేస్ట్ ఎంతో ప్రేత్యేకమైన రుచి సువాసన.
హర్యాలీ బిర్యానీ కూడా దాదాపుగా హైదరాబాదీ ధం బిర్యానీలాగే చేయాలీ. కానీ వేసే పదార్ధాలు వాటి కొలతలు భిన్నం అంతే! హర్యాలీ చికెన్ బిర్యానీ కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అది నేను మరో సారి చెప్తాను.
ఈ సారి ఎప్పుడైనా స్పెషల్ రోజుల్నిమరింత స్పెషల్ చేయాలనుకుంటే తప్పకుండా హర్యాలీ వెజ్ ధం బిర్యానీ చేయాలని గుర్తుంచుకుని చేయండి.

టిప్స్
రైస్:
-
నేను బాస్మతి బియ్యం వాడాను. మీరు ఇంకేదైనా బియ్యం అయినా వాడుకోవచ్చు. బాస్మతి కాక ఇంకే బియ్యం వాడినా ధం చేసేప్పుడు పోసే అన్నం ఉడికించిన నీళ్ళు బాస్మతి బియ్యం కొలతకి పోసే కొలతకంటే ¼ కప్పు ఎక్కువగా పోసుకోవాలి.
-
మాంచి బ్రాండ్ బాస్మతి బియ్యంతో బిర్యానీ ఎప్పుడూ చాలా రుచిగా వస్తుంది. ఒక వేళ మీరు లూస్లో కొంటె సంవత్సరం కంటే పాత బాస్మతి బియ్యం వాడాలి. అప్పుడు మెతుకు పొడి పొడిగా వస్తుంది
-
ఏ బియ్యం వాడిన కచ్చితంగా కడిగి గంట సేపు నానబెట్టుకోవాలి
బిర్యానీ అడుగుపట్టకుండా ఉండాలంటే:
-
బిర్యానీకి కచ్చితంగా మందంగా ఉండే గిన్నెలు ఉంటేనే మాడదు. ఒకవేళ మీ దగ్గర నాలాంటి బిర్యానీ వండే పాత్రలు లేనట్లైతే ప్రెషర్ కుక్కర్ గిన్నె వాడుకోండి అది కాస్త మందంగానే ఉంటుంది.
-
ఏ పాత్రలో వండినా అన్నం అంతా వేసి ధం చేసేప్పుడు బిర్యానీ గిన్నెఅట్ల పెనం మీద పెట్టి ధం చేసుకోండి. అట్ల పెనం మీద పెట్టినప్పుడు మాత్రం మామూలు ధం చేసే సమయం కంటే కాస్త ఎక్కువ సేపు ధం చేసుకోవాలి. అంటే నేను మంట మీద పది నిమిషాలు ధం చేసుకోవాలి అని చెప్తే అదే పెనం మీద అయితే 15 నిమిషాలు చేసుకోవాలి అని అర్ధం చేసుకోండి. ఇలా పెనం మీద పెట్టడం వల్ల అడుగు పట్టదు.
హర్యాలీ పేస్ట్:
- హర్యాలీ పేస్ట్ అంటే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చితో పాటు కొంత పాలకూర కూడా వేస్తారు. నాకు బిర్యానీకి అంత రుచిగా అనిపించదు అందుకే నేను వేయలేదు. నచ్చితే మీరు కొద్దిగా వేసుకోవచ్చు
నూనె – నెయ్యి:
- బిర్యానీలకి నూనె నెయ్యి సరైన మోతాదులో ఉంటేనే రుచి లేదంటే పొడి పొడిగా ఎండిపోయినట్లుగా ఉంటుంది బిర్యానీ
ఇంకొన్ని విషయాలు:
-
బిర్యానీలో నచ్చితే మీరు కాప్సికం, మష్రూమ్, పనీర్ ఇలాంటివి కూడా వాడుకోవచ్చు. నేను వేయలేదు.
-
నేను ఫ్రొజెన్ బటానీ వాడాను కాబట్టి లాస్ట్లో వేశాను. మీరు తాజా బటానీ వాడితే మిగిలిన కూరగాయాలతో పాటే వేసుకుని వేపుకోవాలి
హర్యాలీ వెజ్ ధం బిర్యానీ - రెసిపీ వీడియో
Haryali Veg Dum Biryani | Vegetable Dum Biryani | Hyderabadi Biryani
Prep Time 7 mins
Soaking Time 1 hr
Cook Time 45 mins
Total Time 1 hr 52 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
-
హర్యాలీ పేస్ట్ కోసం
- 50 gm కొత్తిమీర
- 50 gm పుదీనా
- 4 - 5 పచ్చిమిర్చి
- 1/2 ఇంచ్ అల్లం
- 6 - 7 వెల్లులి
- 1/2 cup పెరుగు
- 1 tbsp నిమ్మరసం
-
బిర్యానీ కోసం
- 2 tbsp నూనె
- 2 tbsp నెయ్యి
-
బిర్యానీ మసాలా
- 1/2 tsp మిరియాలు
- 1 tsp షాహీ జీరా
- 1.5 ఇంచ్ దాల్చిన చెక్క
- 6 యాలకలు
- 5 లవంగాలు
- 1 నల్ల యాలక
- 1 జాపత్రి
- 1 అనాస పువ్వు
- 1 మరాటి మొగ్గ
- 1 బిర్యానీ ఆకు
-
కూరగాయలు
- 1 ఉల్లిపాయ చీలికలు
- 1/4 cup ఆలూ
- 15 - 20 కాలీఫ్లవర్ ముక్కలు
- 4 ఫ్రెంచ్ బీన్స్
- 1/2 cup కేరట్ ముక్కలు
- ఉప్పు – రుచికి సరిపడా
- 1 tbsp అల్లం వెల్లులి ముద్దా
-
పొడి మసాలా
- 1/2 tsp పసుపు
- 1 tsp యాలకల పొడి
- 1 tsp గరం మసాలా
- 1.5 tsp కారం
- 1/2 tsp మిరియాల పొడి
- 1 tsp ధనియాల పొడి
- 1 tsp వేయించిన జీలకర్ర పొడి
- 1/2 cup బటానీ
- 1/2 cup పెరుగు
- 1 tsp నిమ్మరసం
-
బిర్యానీ రైస్ వండడానికి
- 2 liter నీళ్ళు
- 2 పచ్చిమిర్చి
- 2.5 tbsp ఉప్పు
- 5 లవంగాలు
- 1 బిర్యానీ ఆకు
- 1 tbsp షాహీ జీరా
- 6 యాలకలు
- 1 మరాటీ మొగ్గ
- 1 జాపత్రి
- 1.5 ఇంచ్ దాల్చిన చెక్క
- 2 cups నానబెట్టిన బాస్మతి బియ్యం (370 gm)
- 1 tsp కేసర్ ఫుడ్ కలర్
- 1/4 tsp గరం మసాలా
- 2 tsp నెయ్యి
విధానం
-
హర్యాలీ పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ మిక్సీలో వేసి చల్లని నీళ్ళతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
-
బిర్యానీ వండే పాత్రలో నెయ్యి నూనె వేసి వేడి చేసి పొడి బిర్యానీ మసాలా అంతా వేసి వేపుకోవాలి.
-
వేగిన మసాలాలో ఉల్లిపాయ చీలికలు వేసి మెత్తబడే దాకా వేపుకోవాలి. తరువాత మిగిలిన కూరగాయాలన్నీ వేసి 60% వేగనివ్వాలి
-
వేగినా కూరగాయాల్లో ఉప్పు మిగిలిన పొడి మసాలాలు (కారం గరం మసాలా ఇంకా..)వేసి వేపుకోవాలి, ఆ తరువాత స్టవ్ ఆపేయండి.
-
స్టవ్ ఆపేసిన తరువాత హర్యాలీ పేస్ట్, ఫ్రొజెన్ బటానీ, పెరుగు, నిమ్మరసం, tbsp నెయ్యి, నూనె వేసి బాగా కలుపుకోవాలి.
-
బిర్యానీ రైస్ వండుకోడానికి మరిగే నీళ్ళలో మసాలా దినుసులు ఉప్పు అన్నీ వేసి మరగ కాగనివ్వాలి 3-4 నిమిషాలు.
-
మరుగుతున్న ఎసరులో నానబెట్టిన బియ్యం వేసి హై ఫ్లేమ్ మీద 80% ఉడికించుకోవాలి.
- 80% ఉడికిన అన్నాన్ని వడకట్టి బిర్యానీ కోసం మసాలాలు కలిపి ఉంచిన కూరగాయల మీద వేసుకోవాలి.
-
అన్నం అంతా వేశాక పైన కొద్దిగా గరం మసాలా నెయ్యి బిర్యానీ రైస్ ఉడికించుకున్న నీళ్ళు ½ కప్పు అన్నం అంతా పోసుకోవాలి ఒకే దగ్గర కాకుండా. ఇంకా కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా.
-
బిర్యానీ గిన్నె అంచులకి మైదా పిండి ముద్ద పెట్టి ఒక దగ్గర కొంచెం ఖాళీ వదిలి ధం బయటకి పోకుండా మూత బిగించి పెట్టాలి.
-
ఆ తరువాత హై ఫ్లేమ్ మీద ఉడికిస్తే స్టీమ్ ఖాళీ వదిలిన చోట నుండి వేగంగా తన్నుకు వస్తుంది. అప్పుడు మంట తగ్గించి లో-ఫ్లేమ్లోకి తగ్గించి మీద 8 నిమిషాలు ఉడికించి, తరువాత స్టవ్ ఆపేసి 20 నిమిషాలు వదిలేయండి.
-
20 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తరువాత మూత తీసి ఘుమఘుమలాడే బిర్యానీ చల్లని రైతాతో ఎంజాయ్ చేయండి.

Leave a comment ×
3 comments