టమాటో కొబ్బరి పాల పులావ్ | ఉల్లి వెల్లులి లేకుండా కమ్మని కొబ్బరి పాలు టమాటో పులావ్

ఉల్లి వెల్లులి లేకుండా కమ్మని కొబ్బరి పాలు పుల్లని టమాటో కలిపి చేసే టమాటో కొబ్బరి పాల పులావ్తో ఎలాంటి స్పైసీ సైడ్ డిష్ ఉన్నా పర్ఫెక్ట్!!!

నాన్ వెజ్ తినే వారికి స్పైసీ నాన్ వెజ్ కర్రీతో ఈ కమ్మని పులావ్ చాలా రుచిగా ఉంటుంది. వెజ్ తినే వారు ఉల్లి వెల్లులి వేయని ఆలూ కుర్మా లేదా నేను ఇది వరకు పోస్ట్ చేసినఉడుపి స్టైల్ మిక్స్ వెజ్ కర్రీ ఉల్లిపాయ వేయకుండా చేసుకున్న చాలా రుచిగా ఉంటుంది.

సాధారణంగా బిర్యానీ పులావ్లు చేసినప్పుడు పరిమళం రుచి కోసం మసాలాలు అల్లం వెల్లులి దట్టించి వేస్తాము, ఆ పులావ్ బిర్యానీ అలా కొంచెం కమ్మని రైతా కలుపుకు తింటే హాయిగా ఉంటుంది. లేదా అసలు ఏ సేడ్ డిష్ లేకుండా అలా తిన్నా చక్కగా ఫ్లేవర్స్ అన్నీ ఆశ్వాదించగలుగుతాము. ఇంకా నాలుగు ముద్దలు ఎక్కువగా తిన్నా పొట్టకి హాయిగా ఉంటుంది.

కానీ మనం అసలే మసాలాలు దట్టించి రైస్ చేసి మళ్ళీ మసాలాలు కారాలు నూనెలు పోసి చేసే మాసాలా కూరలు షేర్వాలు నంజుకు తింటాము. తినడానికి రుచిగా ఉంటుంది కచ్చితంగా కానీ తిన్నాక వచ్చే పరిణామాల వల్లే సమస్యంతా. తిన్నాకా పొట్ట ఉబ్బరిస్తుంది, ఎన్ని నీరు తాగినా దాహం తీరదు. ఇలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కుంటున్నట్లైతే తప్పక నాలా ఉల్లి వెల్లులి మరింత మసాలాలు వేయని లేని ఈ టమాటో కొబ్బరి పాల పులావ్ చేసుకోండి, నోటికి కమ్మగా ఎంతో రుచిగా ఉంటుంది.

టిప్స్

కొబ్బరి పాలు:

  1. నేను తాజా కొబ్బరిలో కొన్ని నీళ్లు పోసి మెత్తునై పేస్ట్ చేసి పలుచని బట్టలో వేసి పిండితే వచ్చే పాలు వాడాను. ఇవి చిక్కని కొబ్బరి పాలు. ఆ తరువాత మిగిలిన పిప్పిలో ఇంకొన్ని నీరు పోసి పిండితే వచ్చే పాలు సెకండ్ ఎక్స్ట్రాక్ట్ పాలు. నేను ఈ పులావ్కి కమ్మని ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ కొబ్బరి పాలే వాడాను.

టమాటో:

  1. మీరు ఏ టమాటో పండ్లైనా వాడుకోవచ్చు. నేను పుల్లని నాటు టొమాటోలు వాడాను. మీరు ఏ రకం వాడిన ఎర్రటి పండిన టమాటోలు వాడుకుంటే పులావ్కి మాంచి రంగు రుచి చేకూరుతుంది.

ఇంకొన్ని విషయాలు:

  1. నేను మామూలు రోజు మనం తినే బియ్యం వాడాను, మీరు కావాలంటే బాస్మతి కూడా వాడుకోవచ్చు.

  2. మామూలు బియ్యం అయితే కప్పుకి రెండింతలు ఉండాలి ఎసరు అవి కొబ్బరి పాలు టమాటో గుజ్జు నీరు కలిపి. నేను కొబ్బరి పాలు ఎక్కువ, అందులో కొంత తక్కువ టమాటో గుజ్జు నీరు తీసుకున్నాను.

  3. ఇదే మీరు బాస్మతితో చేసుకోదలిస్తే నీరు ½ కప్పు మాత్రమే పోసుకోండి. మిగిలినవి ఇదే కొలతలు పాటిస్తూ.

  4. నేను విడిగా గిన్నెలో వండుతున్నాను, మీరు కుక్కర్లో మూడు విజిల్స్ రానిచ్చి చేసుకోవచ్చు. బాస్మతి బియ్యంతో అయితే 2 విజిల్స్ సరిపోతాయి.

ఇంకో తీరు:

  1. మీరు ఈ పులావుతో మసాలా కూర చేసుకుంటున్నట్లైతే నా తీరులో చేసుకోండి. లేదు ఇదే పులావ్లో మసాలాలు ఉండాలనుకుంటే హ్యాపీగా ఉల్లిపాయని ఎర్రగా వేపి అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకుని నేను వేసిన దానికంటే ఇంకొన్ని మసాలాలు పెంచి చేసుకోండి.

టమాటో కొబ్బరి పాల పులావ్ | ఉల్లి వెల్లులి లేకుండా కమ్మని కొబ్బరి పాలు టమాటో పులావ్ - రెసిపీ వీడియో

No Onion Garlic Tomato Coconut Pulao| Tomato Coconut Pulav recipe

Pulao and Biryanis | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 20 mins
  • Resting Time 10 mins
  • Total Time 40 mins
  • Serves 5

కావాల్సిన పదార్ధాలు

  • 5 ఎర్రటి టమాటో పండ్లు
  • 1.5 cups పచ్చికొబ్బరి ముక్కలు
  • 5 పచ్చిమిర్చి (నిలువుగా చీరినవి)
  • 2 tbsp నూనె
  • 2 బిర్యానీ ఆకులు
  • 2 Inches దాల్చిన చెక్క
  • 4-5 లవంగాలు
  • 1 cup నీళ్లు
  • 1.5 cup కొబ్బరి పాలు
  • 1 cup టమాటో గుజ్జు
  • ఉప్పు
  • 1.5 cup బియ్యం

విధానం

  1. టమాటో పండ్లకి గాట్లు పెట్టి నీరు పోసి టమాటో పైన తోలు సులభంగా వచ్చేదాక ఉడికించి తీసుకోండి.
  2. టమాటో పైన తోలు అంతా తీసి మిక్సీలో వేసి నీరు వేయకుండా మెత్తని పేస్ట్ చేసుకోండి. ఆ తరువాత జల్లెడలో వేసి వడకట్టుకోండి.
  3. పచ్చి కొబ్బరి ముక్కల్లో కొద్దిగా అంటే మిక్సీ త్తిరగడానికి సరిపడా నీరు పోసి కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసి పలుచని బట్టలో వేసి పిండితే చిక్కని కొబ్బరి పాలు వస్తాయి, వాటిని పక్కనుంచుకోండి
  4. నూనె వేడి చేసి అందులో మసాలా దినుసులు పచ్చిమిర్చీ వేసి మసాలాలని ఎర్రగా వేపుకోండి
  5. కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసి బియ్యం తెల్లగా మారేదాకా వేపుకోండి.
  6. వేగిన బియ్యంలో కొబ్బరి పాలు టమాటో గుజ్జు నీరు ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద అన్నం వండుకున్నట్లు వండుకొండి. (కుక్కర్లో చేసే తీరు టిప్స్లో ఉంది చుడండి)
  7. మెతుకు మెత్తబడ్డాక స్టవ్ ఆపేసి 10-15 నిమిషాలు వదిలేస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది. తరువాత సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Yummy. I used hand pounded semi brown rice. It took 7 whistles And made it spicy to eat as it is.